Friday, January 24, 2014

పూర్లఫల సమర్పణ


శ్రీ మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి
పూర్లఫల సమర్పణ

త్వమస్మిన్  కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ 
హనుమాన్ యత్న మాస్తాయ దుఃఖ క్షయ కరొభవ 

ఇది సీతా అమ్మవారు స్వయంగా జపించిన మంత్రం. సీతారామ పాదారవింద సేవకుడైన ఆంజనేయ ప్రభువు లంకా నగరంలో అమ్మవారిని మొట్టమొదటిసారిగా దర్శించి తన పంచముఖాంజనేయ  విరాడ్రూపాన్ని సాక్షాత్కరింప చేసినప్పుడు ఆ జగన్మాత జగద్రక్షణ కోసం తను చేస్తున్న ప్రార్దానగా అందించిన పవిత్ర మంత్రమిది.

" హే ఆంజనేయ ప్రభూ ! ఈ పని ఎలా నెరవేరాలో అది నీకే బాగా తెలుసు. ఓ దేవా ! నువ్వు పట్టుబట్టి , నా పని సాధించిపెట్టు, నా దుఃఖాన్ని పోగొట్టు " అని ఆ తల్లి ఆనాడు చేసిన ప్రార్దనే పై మంత్రం .

మానవులకు కోరికలుండటం, వాటిలో కొన్ని తీరకపోవటం   ఎంతో సహజం. తీరని కోరికలలో ఏ మంచి కోరికకైనా సరే ఆంజనేయ స్వామి సహాయం చేస్తాడు. మరకత ఆంజనేయ మూర్తి మరింత మహాశక్తిమంతుడు. ఆ స్వామి సద్గురుదేవుల దివ్య హస్త ప్రతిష్టితుడైనపుడు ఆ శక్తికి కొలతే లేదు . అలాంటి స్వామి సన్నిధిలో భక్తులందరి కోరికలూ తీరాలనే దివ్య సంకల్పంతో గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఆ స్వామి  శక్తికి తన శక్తిని కూడా జోడించి పూర్ణఫల సమర్పణ అనే ప్రక్రియను ఏర్పాటు చేసారు. ఐహికాముష్మికాలకు సంబంధించిన  ఏ కోరికనైనా భక్తులు ఈ ప్రక్రియ ద్వారా అతి సులభంగా తీర్చుకోనవచ్చును.

భక్తులు హైదరాబాదు దుండిగల్ శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని మరకత ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చి అర్చకునిచే పూర్ణఫల సమర్పణ సంకల్పం చెప్పించుకొని తమ కోరికను స్వామికి విన్నవించుకొని, ఫై మంత్రాన్ని జపిస్తూ స్వామికి 11 సార్లు ప్రదక్షిణం చేసి , అర్చకులు నిర్దేశించిన స్ధలంలో ఒక నిండు కొబ్బరి బొండామును కట్టి తరువాత 17 వ రోజు మళ్లీ వచ్చి పూజ చేయించుకొని తాము కట్టిన బొండామును బైటకు తీసి స్వామికి పూజ  చేయించుకొని  ఇంటికి తీసుకువెళ్ళి కుటుంబసభ్యులు మాత్రము స్వీటు ప్రసాదముగా స్వీకరించాలి. ఈ 16 రోజులలో ఫై మంత్రాన్ని ప్రతిరొజూ  108 సార్లు జపిస్తూ ఉండాలి. నిష్కల్మషమైన భక్తితో, శ్రద్దా విశ్వాసాలతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ధర్మబద్దమైన ఏ కోరికైనా నెరవేరి తీరుతుంది. ఇది ముమ్మాటికీ ఖాయము. ఈ వ్రతం చేసే సమయంలో శాఖాహారిగా యుండాలి. మద్యపానం మరియు మాంసాహారాన్ని నిషేదించాలి.

గురుదేవులు, శ్రీ స్వామీజీ, కలిజనుల కోసమై చేసిన ఈ వ్యవస్థను సద్భక్తులు సద్వినియోగం చేసుకొని , సకల సంకటాల నుండి విముక్తులై  శాశ్వత ఆనంద పాత్రులగుదురు గాక!

గమనిక : 17 వ రోజు అనివార్య కారణాల వలన భక్తులు మళ్లీ స్వామి సన్నిధికి వ్యక్తిగతంగా రాలేకపోయినచో  ఆలయ కమిటీ వారే ఆనాడు పూజ జరిపించి స్వామికి ఫల సమర్పణ చేయించే ఏర్పాటు వుంది. భక్తులు తమ స్వంత పేరు మీద మాత్రేమే కాక తమ సన్నిహిత బంధు మిత్రాదుల పేర్ల మీద గూడా పూర్ణఫల సమర్పణ చెయించవచ్చును.

పూర్ణఫల సమర్పణ సమయము : ప్రతీ రోజు ఉదయం 7.00 గం. నుండి 11.30 గం. వరకు , సా. 5.00 గం. నుండి 7.30 గంటల వరకు 

మరిన్ని వివరములు కావాలంటే ఈ క్రింది వారిని సంప్రదించండి 

ఎస్.జి.ఎస్.ఆశ్రమము
ఏర్ ఫోర్స్  ఆకాడమీ రోడ్, దుండిగల్, హైదరాబాదు - 500 043.
ఫోన్ నెం. 08418-255685

గమనిక : ప్రతి నెల రెండవ శనివారం ఉదయము గం. 9.00 లకు శ్రీ ఆంజనేయ స్వామి వారికి క్షిరాభిషేకము జరుపబడును. 









No comments:

Post a Comment